ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-2019 విజయానికి వ్యూహాలు..

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో వేర్వేరు స్థాయిల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక ప్రక్రియకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్1 ఆఫీసర్, సీనియర్ మేనేజర్ లెవల్ పోస్టులైన స్కేల్ 2,3 ఉద్యోగాల భర్తీని ఐబీపీఎస్ చేపడుతోంది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ చక్కటి అవకాశం. సొంత ప్రాంతంలో పనిచేసే అవకాశంతోపాటు, ఆకర్షణీయమైన వేతనాలు అందుకునే వీలుంది. తాజాగా ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-2019 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ, ప్రిపరేషన్ గెడైన్స్...
Career Guidance ఖాళీల వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య:
8,401
  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 3688
    ఆంధ్రప్రదేశ్:
    ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు: 130; చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు: 93; సప్తగిరి గ్రామీణ బ్యాంకు: 50.
    తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు: 89; తెలంగాణ గ్రామీణ బ్యాంకు: 115
  • ఆఫీసర్ స్కేల్ -1 (అసిస్టెంట్ మేనేజర్) : 3382.
    ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు:
    100
    సప్తగిరి గ్రామీణ బ్యాంకు: 60

తెలంగాణ:
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు: 100
తెలంగాణ గ్రామీణ బ్యాంకు: 20
  • ఆఫీసర్ స్కేల్- 2 : (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు)-893; ఆఫీసర్ స్కేల్-2 (అగ్రికల్చర్ ఆఫీసర్: 106; మార్కెటింగ్ ఆఫీసర్: 45; ట్రెజరీ మేనేజర్: 11; లా ఆఫీసర్: 19; సీఏ: 24; ఐటీ ఆఫీసర్: 76);
  • ఆఫీసర్ స్కేల్- 3 (సీనియర్ మేనేజర్) : 157.

అర్హతలు
  • మల్టీపర్పస్, స్కేల్ 1(అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ స్కేల్ 2(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు), సీనియర్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాషతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
  • స్కేల్1, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులకు.. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో రెండేళ్ల అనుభవం; సీనియర్ మేనేజర్ పోస్టులకు అయిదేళ్ల అనుభవం ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ/పీజీ విద్యార్హతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది/రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

వయసు :
  • ఆయా పోస్టులను బట్టి 2019 జూన్ 1 నాటికి 18-40 ఏళ్ల వారు అర్హులు.
  • మల్టీపర్పస్ అసిస్టెంట్, స్కేల్1 ఆఫీసర్ పోస్టులకు ఎలాంటి పని అనుభవం అవసరం లేదు. మల్టీపర్పస్ పోస్టులకు 18-28 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30ఏళ్లు. ఎస్సీ,ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఎంపిక విధానం:
  • ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఉంటాయి. అసిస్టెంట్స్ పోస్టులను మెయిన్స్‌లో సాధించే స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు మెయిన్స్, మౌఖిక పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్కేల్-2, 3 ఆఫీసర్ పోస్టులను ఆన్‌లైన్ పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు.
  • ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష(45 నిమిషాలు) 80 మార్కులకు ఉంటుంది.
  • మల్టీపర్పస్ పోస్టులకు రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
  • ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 40 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రశ్నల క్లిష్టత స్థాయిలో మార్పులు ఉంటాయి. సెక్షనల్ కటాఫ్,రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్ రాసేందుకు అనుమతి లభిస్తుంది.
  • మెయిన్ పరీక్ష 200 ప్రశ్నలకు 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, కంప్యూటర్ నాలెడ్‌‌జ తదితర అంశాలు ఉంటాయి.

వేతనాలు ఆకర్షణీయం :
ఆర్‌ఆర్‌బీ ఉద్యోగులకు వేతనాలు ఆకర్షణీయమని చెప్పొచ్చు. పదోన్నతులు కూడా ఆయా బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. వీరికి కేరీర్ ప్రారంభంలో బేసిక్, హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ప్రత్యేక అలవెన్సులు కలుపుకొని నెలకు రూ.36,500లకు పైగానే వేతనం అందుతుంది. అదే స్కేల్-2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌కు రూ.46వేలకు పైగా జీతం లభిస్తుంది. మల్టీపర్పస్ స్టాఫ్‌కు రూ.23 వేల వరకు ఉంటుంది. వీరు పనిచేసే ప్రాంతం, బ్యాంక్ ఆధారంగా వేతనాల్లో కొంత మేర వ్యత్యాసాలు ఉండొచ్చు. వేతనాలతోపాటు ట్రావెలింగ్ అలవెన్సులు, పెట్రోల్, డీజిల్ అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, ఇన్సూరెన్సు సౌకర్యం ఉంటుంది.

ప్రిపరేషన్ వ్యూహాలు..
అసిస్టెంట్, స్కేల్-1 ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడతారు. వీరు ప్రిలిమ్స్, మెయిన్‌లో కామన్‌గా ఉండే రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సెక్షన్లకు సన్నద్ధమవ్వాలి. స్కేల్-1 స్థాయిలో సన్నద్ధమైతే అసిస్టెంట్ పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
  • న్యూమరికల్ ఎబిలిటీ/క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో స్కోరు చేయాలంటే.. బేసిక్స్‌పై పట్టు ఎంతో ముఖ్యం. బ్యాంకింగ్ పరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మల్టిప్లికేషన్ టేబుల్స్ కంఠస్తం చేయాలి. కూడికలు, తీసివేతలు, బాగాహారాలు, గుణకారాలు మొదలైన ప్రాథమిక అంశాలు వేగంగా చేయగలిగేలా సన్నద్ధమవ్వాలి. వర్గాలు, వర్గమూలాలు, ఘనమూలాలకు షార్ట్‌కట్స్ నేర్చుకోవాలి.
  • నిష్పత్తులు, శాతాలు, సగటు వంటి కీలక టాపిక్స్‌ను అవగాహన చేసుకోవాలి. వీటిపై పట్టు సాధిస్తే కటాఫ్ మార్కులు పొందడం సులువు.ఓవరాల్ కటాఫ్ మార్కులు సాధించడానికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి.
  • పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నలు గమనిస్తే కొన్ని చాప్టర్లకు ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తోంది. సింప్లిఫికేషన్/అప్రాక్షిమేషన్ ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. వీటిని తక్కువ సమయంలో సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులు వీటిపై ముందుగా దృష్టిపెట్టాలి. ఇక తప్పనిసరిగా ఉండే మరో విభాగం.. నంబర్ సిరీస్. ఇందులో స్కోరు చేసేందుకు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే నంబర్లపై పట్టు లభిస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ప్రధానమైన టాపిక్. దీన్నుంచి తప్పనిసరిగా ప్రిలిమ్స్, మెయిన్స్‌లో 5 ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ వెయిటేజీ ఉన్న మరో విభాగం.. డేటా ఇంటర్‌ప్రిటేషన్. నిష్పత్తులు, శాతాలు, సగటు అధ్యాయాల్లో నైపుణ్యం ఉంటే డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలకు తక్కువ సమయంలో సమాధానాలు రాబట్టవచ్చు.
  • అర్థమెటిక్ అంశాల్లో.. పార్టనర్‌షిప్స్, పర్సంటేజెస్ దాని అనువర్తనాలు; రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్ చాప్టర్లు ముఖ్యమైనవి. గత కొన్ని నోటిఫికేషన్ల నుంచి బ్యాంకింగ్ పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉంటోంది. కాబట్టి అభ్యర్థులు క్లిష్టత స్థాయి ఎక్కువగా ఉన్న ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా పరీక్షకు కేటాయించే సమయం చాలా తక్కువగా ఉంటోంది. ప్రశ్నలకు సమాధానాలుసాధించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. కాబట్టి ఇప్పటి నుంచే అర్థమెటిక్ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల సమయ పాలన అలవడుతుంది. వీలైనన్నీ మాక్‌టెస్టులు రాయడం ఉపకరిస్తుంది.

రీజనింగ్ :
  • అభ్యర్థుల లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను పరీక్షించే విభాగం.. రీజనింగ్. ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు ట్రిక్కిగా ఉంటాయి. టాపిక్స్ వారిగా ఏయే అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని తదనుగుణంగా సన్నద్ధమవ్వాలి. రీజనింగ్‌లో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా... సమయం వృథా అవుతుంది. అలాగే కఠినంగా ఉండే ప్రశ్నలను వదిలేసి చివర్లో సాధించే ప్రయత్నం చేయాలి.
  • కోడెడ్‌ఇన్‌ఈక్వాలిటీస్/ఇన్‌పుట్ ఔట్‌పుట్; సిలాయిజమ్స్/కోడింగ్ అండ్ డీకోడింగ్, సీటింగ్ అరెంజ్‌మెంట్స్ అండ్ పజిల్స్(సర్కులర్, లీనియర్ అరెంజ్‌మెంట్స్, ఫ్లోర్ టెస్ట్స్) సెక్షన్ల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. అలాగే బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్స్ అండ్ డిస్టెన్స్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్, క్రిటికల్ రీజనింగ్ సెక్షన్లకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది.
  • రీజనింగ్‌లో కొన్ని చాప్టర్లకు ఎక్కువ సమయం అవసరం ఉండదు. ఇలాంటి వాటిని గుర్తించి వాటికి మొదట సమాధానాలు గుర్తిస్తే, కఠినంగా ఉన్న ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. కోడెడ్ ఇన్‌ఈక్వాలిటీస్, సిలాయిజమ్స్, డెరైక్షన్స్ అండ్ డిస్టెన్స్ కొంత సులువుగా ఉండే విభాగాలని చెప్పొచ్చు. కొన్ని ప్రశ్నల కాఠిన్యత మధ్యస్తంగా ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు వెయిటేజీ ఎక్కువ. కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్ ఈ కోవకు చెందినవి. ఈ టాపిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు సాధించడానికి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
  • సర్క్యులర్ సీటింగ్ అరేంజ్‌మెంట్, లీనియర్ సీటింగ్ అరేంజ్‌మెంట్, డబుల్ లైనప్ అండ్ పజిల్స్ విభాగాలు రీజనింగ్‌లో ఎక్కువ కాఠిన్యత ఉండేవిగా చెప్పవచ్చు. ఈ ప్రశ్నలను చివర్లో సాధించడం మేలు. మాక్‌టెస్టులు తుది పరీక్షగా భావించి రాయాలి. మాక్‌టెస్టులు రాసేటప్పుడు అనుసరించే వ్యూహాన్నే మెయిన్ పరీక్షకు అనుసరించాలి. గత పేపర్ల సాధన సన్నద్ధతకు ఉపయోగపడుతుంది.

ఇంగ్లిష్ :
  • మెయిన్‌లో మాత్రమే కనిపించే సబ్జెక్ట్.. ఇంగ్లిష్. గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు కొంత ఆందోళన చెందే విభాగం ఇది. కానీ ఇందులో సాధించే స్కోరే తుది ఎంపికలో కీలకంగా మారుతుంది. వొకాబ్యులరీ, గ్రామర్‌పై పట్టు ఉంటే మాత్రం మంచి స్కోరు చేయవచ్చు. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్/సెంటెన్స్ జంబుల్/ఆడ్ మన్ ఔట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. గ్రామర్‌పై పట్టు సాధించాక సాధ్యమైనన్నీ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటికే నేర్చుకున్న వొకాబ్యులరీని పునశ్చరణ చేసుకోవాలి.
  • ఎకానమీకి సంబంధించిన టెర్మినాలజీ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో వొకాబ్యులరీ ఆధారిత ప్రశ్నలకు మొదట సమాధానాలు గుర్తించాలి. ఇవి కాసింత సులువుగా ఉంటాయి. ఇచ్చిన ప్యాసేజీ ఆధారంగా సందర్భానుసారంగా సమాధానాలు రాబట్టడం తేలికగా ఉంటుంది. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు నిత్యం ఇంగ్లిష్ పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి.

జనరల్ అవేర్‌నెస్ :
  • సులువుగా, వేగంగా చేయగలిగే సెక్షన్ ఇది. మెయిన్‌లో మాత్రమే ఉంది. తాజా పరిణామాలపై పట్టు ఉంటేనే జనరల్ అవేర్‌నెస్‌లో స్కోరు చేసే వీలుంటుంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ విభాగంలోని మొత్తం 40 ప్రశ్నల్లో.. స్టాండర్డ్ జీకే నుంచి 5 ప్రశ్నలు, బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 10, కరెంట్ అఫైర్స్ నుంచి 25 ప్రశ్నలు వస్తున్నాయి.
  • వివిధ దేశాల కరెన్సీలు, రాజధానులు, నేషనల్ పార్కులు, ముఖ్య తేదీలు, పోర్టులు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు,న్యూక్లియర్ పవర్‌ప్లాంట్స్, నదులు, రిజర్వాయర్లు.. అవి ఉన్న ప్రదేశాలు, నృత్యాలు,భాషలు,ప్రముఖబ్యాంకులు - ప్రధాన కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు - అవి ఉన్న ప్రదేశాలు,స్పోర్ట్స్-కప్స్, స్పోర్ట్స్-ప్లేయర్స్, స్టేడియాలు-ప్రాంతాలు నేర్చుకోవాలి.
  • బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు సంబంధించి మానిటరీ పాలసీ, ఎన్‌పీఏలు, ఎంసీఎల్‌ఆర్, డిజిటల్ పేమెంట్స్, బ్యాంకులు-వాటి యాప్స్, జీఎస్‌టీ, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్రెన్సీ కోడ్ తదితర వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
    కరెంట్ అఫైర్స్‌లో ప్రభుత్వ విధానాలు, ఆర్‌బీఐ అండ్ బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ,డిఫెన్స్‌టెక్నాలజీ, మిలిటరీ ఎక్సెర్‌సెజైస్,సదస్సులు, అవార్డులు, నియామకాలు, అంబాసిడర్లు, బుక్స్-ఆథర్స్, ఇండెక్స్, కమిటీలు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

కంప్యూటర్ నాలెడ్జ్ :
కొద్దిపాటి ప్రిపరేషన్‌తో మంచి మార్కులు సాధించేందుకు అవకాశమున్న విభాగం ఇది. కంప్యూటర్ పనితీరుపై ప్రాథమిక ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్‌వర్క్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్/అబ్రివేషన్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎంఎస్ ఆఫీస్ టూల్స్ గురించి తెలుసుకోవాలి.

ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
2019 జూలై 4
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: ఆఫీసర్ స్కేల్-1కు 2019 ఆగస్టు 3, 4, 11 తేదీల్లో; ఆఫీస్ అసిస్టెంట్లకు-ఆగస్టు 17, 18, 25 తేదీల్లో
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీలు: ఆఫీసర్స్ పోస్టులకు సెప్టెంబర్ 22, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు సెప్టెంబర్ 29న నిర్వహిస్తారు.
  • ఇంటర్వ్యూలు నవంబర్‌లో ఉంటాయి.
    దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600,
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100. ఒక పోస్టు కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకుంటే వేర్వేరుగా అప్లికేషన్ ఫీజులు చెల్లించాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ibps.in
Published on 7/6/2019 5:36:00 PM
టాగ్లు:
IBPS RRB-2019 IBPS RRB-2019notification IBPS RRB-2019preparation tips office assistant posts Andhra pragathi grameena bank officer scale 1&2 jobs IBPS RRB-2019syllabus quantitative aptitude English general awareness

Related Topics