Sakshi education logo

కరెంట్ అఫైర్స్ (ఏప్రిల్ 17 - 23, 2020)

Join our Community

facebook Twitter Youtube

అంతర్జాతీయం
దక్షిణ కొరియాలో అధికార పార్టీ విజయం
Current Affairs
సియోల్: కరోనా కట్టడిలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు చూపించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆధ్వర్యంలో అధికార డెమొక్రాటిక్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. మొత్తం 300 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో మూన్ నేతృత్వంలో లెఫ్ట్ పార్టీల కూటమికి 180 సీట్లు వస్తే, ప్రతిపక్ష కన్జర్వేటివ్ యునెటైడ్ కూటమి 103 స్థానాలు దక్కించుకుంది. 1987 తర్వాత దక్షిణ కొరియాలో ఏ పార్టీకి ఈ స్థాయి విజయం దక్కలేదు. కరోనాని అరికట్టడంలో అధ్యక్షుడు చూపించిన పనితీరుకే ప్రజలు మూన్‌కే మళ్లీ పట్టం కట్టారు.
టీకా ఒక్కటే మార్గం..
కోవిడ్ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు.
ఆఫ్రికాలో 3 లక్షల మంది మరణిస్తారు: యూఎన్
కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసినప్పటికీ 2020 ఏడాది ఆఫ్రికా ఖండంలో 3 లక్షల మరణాలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ ఆఫ్రికా విభాగం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మృతుల సంఖ్య 33 లక్షల వరకు కూడా ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్ సోకుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా కేసులు 20 వేలకు చేరుకున్నాయి.
దక్షిణాఫ్రికాకు భారత్ సహకారం: మోదీ
కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను తక్షణమే సరఫరా చేస్తామని ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాపోసాతో కోవిడ్ మహమ్మారిపై చర్చించినట్టు ప్రధాని ట్వీట్ చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్‌సీసీతోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంక్షోభం గురించి చర్చించినట్టు ప్రధాని వెల్లడించారు.

కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ఆ వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ చేపట్టడానికి సన్నద్ధమైంది. చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ వైరస్ ప్రమాదవశాత్తూ బయటకి వచ్చి ఉండడానికే అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆ కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి సమగ్ర దర్యాప్తు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 18న ప్రకటించారు.
వూహాన్ మార్కెట్‌లో ఆ గబ్బిలాలు లేవా ?
కరోనా వైరస్ ఒకానొక రకమైన గబ్బిలం నుంచి సోకిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే అలాంటి గబ్బిలాలు ఆ ప్రాంతంలో లేవని వూహాన్ వెట్ మార్కెట్లో గబ్బిలం మాంసం విక్రయాలు జరగలేదంటూ ఫాక్స్ న్యూస్ చానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. చైనా సర్కార్ చెబుతున్న గబ్బిలాలు వూహాన్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్నాయంటూ తాను రూపొందించిన నివేదికలో వెల్లడించింది. అంతేకాదు కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి పేషెంట్ జీరో వైరాలజీ ల్యాబ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని ఆ వ్యక్తి ద్వారానే కరోనా సోకిందని చెబుతోంది.
ల్యాబ్‌లో భద్రత కరువు?
వూహాన్‌లో వైరాలజీ ల్యాబొరేటరీకి భద్రతా ఏర్పాట్లు తగినంత స్థాయిలో లేవని, అందుకే ఏదైనా జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాషింగ్టన్ పోస్టు తన కథనంలో రాసుకొచ్చింది.
ఆ ల్యాబ్‌లో ఏం చేస్తారు?
వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ఆసియాలోనే అతి పెద్ద వైరాలజీ ల్యాబ్. అందులో 1,500 రకాల వైరస్‌లపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ల తీవ్రత అనుగుణంగా పీ1 నుంచి పీ4 వరకు ల్యాబ్‌లలో పరిశోధనలు చేస్తారు. తక్కువ హానికర వైరస్‌లను పీ1లో చేస్తే ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై పీ4 ల్యాబొరేటరీలో చేస్తారు. ఈ పీ4 ల్యాబొరేటరీని 4.2 కోట్ల డాలర్ల వ్యయంతో 2015లో నిర్మించారు. 2018 నుంచి పని చేయడం ప్రారంభించింది. గబ్బిలం నుంచి సంక్రమించే వైరస్‌లపై ఇక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. వూహాన్ శివార్లలో ఉండే ఈ ల్యాబ్‌కి సమీపంలో వెట్ మార్కెట్ ఉంది. ఈ ల్యాబ్‌లో పనిచేయాలంటే సమర్థవంతులైన టెక్నీషియన్లు ఉండాలి. అయితే ఈ ల్యాబ్‌లో నిపుణుల కొరత ఉందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా గతంలో సూచించింది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి సంస్థలు ఆ ల్యాబ్‌లో పటిష్టమైన భద్రత ఉందని, అందులోంచి వైరస్ లీకయ్యే అవకాశం లేదని కచ్చితంగా చెబుతున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా వైరస్ పుట్టుకపై సమగ్ర విచారణ
ఎప్పుడు:ఏప్రిల్ 18
ఎవరు:అమెరికా
ఎందుకు: అమెరికా మీడియా కథనాల్లో లేవనెత్తిన పలు సందేహాలకు సమాధానాలు రాబట్టడానికి

వైరస్ ల్యాబ్ నుంచి రాలేదు: వూహాన్ ల్యాబ్ చీఫ్
చైనాలోని వూహాన్‌లో వైరాలజీ ల్యాబరెటరీ నుంచే కోవిడ్-19(కరోనా వైరస్) బయటకు వచ్చిందని అమెరికా చేస్తున్న ఆరోపణల్ని వూహాన్ వైరాలజీ ల్యాబ్ చీఫ్ తోసిపుచ్చారు. కరోనా వైరస్ బట్టబయలు అయ్యాక తొలిసారిగా ల్యాబ్ డెరైక్టర్ యాన్ జిమింగ్ ఏప్రిల్ 19న మీడియాకి ఇంటర్వూ ఇచ్చారు. ‘‘ఈ ల్యాబ్‌లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో, ఎంత గట్టి భద్రత ఉందో మాకే తెలుసు. ల్యాబ్‌లోంచి వైరస్ బయటకు వచ్చే అవకాశం లేదు’’అని స్పష్టం చేశారు. మరోవైపు వూహాన్‌లో వైరస్ అత్యంత తక్కువ ప్రమాదకరంగా ఉందని చైనా ప్రభుత్వం ప్రకటించింది.

చైనా నుంచి మరో 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
కోవిడ్-19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లను భారత్‌కు పంపినట్లు చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఈ కిట్లను గ్వాంగ్‌ర నుంచి విమానంలో రాజస్తాన్, తమిళనాడుకు పంపామన్నారు. చైనా గతవారం 6.50 లక్షల యాంటీబాడీ కిట్లు, ఆర్‌ఎన్‌ఏ కిట్లను భారత్‌కు పంపింది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బంది రక్షణ కోసం భారత్ ఇప్పటికే 1.50 కోట్ల పర్సనల్ ప్రొటెక్షన్ దుస్తుల కోసం చైనా కంపెనీలకు ఆర్డరిచ్చింది.

అమెరికా విచారణకు చైనా నిరాకరణ
కరోనా వైరస్ పుట్టుకపై విచారణకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది.మేము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదని ఏప్రిల్ 20న తెలిపింది. కరోనా వైరస్ చైనాలోని వూహాన్‌లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది. ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. ‘వైరస్ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు.

భారత్ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నేపథ్యంలో చైనా సహా పొరుగుదేశాలు ’ఆవకాశవాద టేకోవర్’లకు పాల్పడకుండా భారత్ కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న, లేదా భవిష్యత్తు ఎఫ్‌డీఐల (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విషయంలోనూ ఓనర్‌షిప్ బదిలీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

తొలిసారిగా మైనస్‌లోకి ముడి చమురు ధరలు
అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా ‘నెగిటివ్’(మైనస్)లోకి జారిపోయాయి. అమెరికాలో నిల్వ సామర్థ్యం లేకపోవడం, కరోనా వైరస్ కల్లోలంతో పలు దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో డిమాండ్ బాగా తగ్గడం, లాక్‌డౌన్ ముగిసి డిమాండ్ ఎప్పుడు పుంజుకుంటుందో స్పష్టత లేకపోవడం, ట్రేడర్లు చమురు డెలివరీలకు ఇష్టపడకపోవడంతో ధరలు ఈ రేంజ్‌లో పడిపోయాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు ధర (మే ఫ్యూచర్స్) ఏప్రిల్ 17న ఒక్క బ్యారెల్‌కు 18.27 డాలర్ల వద్ద ముగిసింది. ఏప్రిల్ 20న ఒక దశలో 220 శాతం (40 డాలర్లకు) పైగా నష్టంతో మైనస్ 28 డాలర్లకు పడిపోయింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్‌లో డబ్ల్యూటీఐ చమురు 1983 ఏప్రిల్ నుంచి ట్రేడవడం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే, ఇదే అత్యధిక కనిష్ట ధర. కాగా జూన్ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ మాత్రం 22.25 బ్యారెల్ వద్ద ట్రేడ్ అవుతోంది. మే, జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా (స్ప్రెడ్) భారీగా (40 డాలర్లకు మించి) ఉండటం విశేషం. రెండు వరుస నెలల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ల ధరల తేడా ఈ రేంజ్‌లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తొలిసారిగా మైనస్‌లోకి ముడి చమురు ధరలు
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎక్కడ:అమెరికా మార్కెట్
ఎందుకు: కరోనా వైరస్ కల్లోలంతో

కరోనాతో ఆకలికేకలు రెట్టింపు: ఐరాస
ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య కోవిడ్-19 కారణంగా రెట్టింపు కానుందని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఒక నివేదికను సమర్పించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన ప్రపంచ ఆర్థిక రంగం అంతర్జాతీయంగా ఆకలికేకలను మరింత పెంచే అవకాశం ఉన్నదని ఈ నివేదికలో వెల్లడైంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తోంటే, కోవిడ్ ప్రభావంతో 2020 యేడాదికి ఈ సంఖ్య మరో 13 కోట్లు పెరిగి, 26.5 కోట్లకు చేరుతుందని ఆ రిపోర్టు అంచనా వేసింది. 50 దేశాలకు చెందిన 2019 ఏడాది రిపోర్టులను 2020 ఏడాదితో పోల్చి చూస్తే ఆహార సంక్షోభం 12.3 కోట్లకు అంటే పది శాతం పెరిగింది.
158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు ఆటంకం
కరోనా వైరస్ ప్రపంచ విద్యా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు 191 దేశాల్లో విద్యాసంస్థలు మూతపడగా.. 158 కోట్ల మంది విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఇలా అన్ని సంస్థల్లోని బోధన నిలిచిపోయింది. విద్యారంగంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) అధ్యయనం చేస్తూ నివేదికలను విడుదల చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య రెట్టింపు
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం
ఎక్కడ:ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు: కోవిడ్-19 కారణంగా

కరోనా జంతువుల నుంచే పుట్టింది: డబ్ల్యూహెచ్‌ఓ
కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని, ల్యాబ్‌లో వైరస్ ఉద్భవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అన్నిరకాల ఆధారాలు కరోనా వైరస్ పుట్టుకకు జంతువులే కారణమని రుజువు చేస్తున్నాయని ఏప్రిల్ 21న తెలిపింది. కోవిడ్-19 లేబొరెటరీలో సృష్టించింది కాదని స్పష్టం చేసింది. అయితే గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా ఎలా వ్యాపించిందన్న విషయంపై ఇంకా పూర్తి వివరాలు కనుగొనాల్సి ఉందని పేర్కొంది.
ప్రపంచానికి చెమటలు పట్టిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ తమ సృష్టి కాదని, అపనవసరంగా నిందలు వేయడం తగదని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధికారులు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా ఇదే అభిప్రాయాన్ని డబ్ల్యూహెచ్‌వో వ్యక్తం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా జంతువుల నుంచే పుట్టింది
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు: కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్‌లో జన్మించిందంటూ అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో

ఇమిగ్రేషన్ వీసాలపై నిషేధం: ట్రంప్
అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే అధికారిక ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదృశ్య శత్రువైన కరోనా వైరస్ దాడి నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు, అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 20న ట్వీట్ చేశారు.
హెచ్1బీ పైనా ప్రభావం
ట్రంప్ సంతకం చేయనున్న ఉత్తర్వుల్లో ఏం ఉండబోతోందన్నది, ఆ ఉత్తర్వులపై ఆయన ఎప్పుడు సంతకం చేయనున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఇమిగ్రేషన్ వీసాలపైననే తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ట్రంప్ ట్వీట్ చేసినప్పటికీ.. అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ఆ ట్వీట్‌లో ప్రస్తావించినందువల్ల నాన్- ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే.. విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా ఇప్పటికే యూరోప్, చైనా, కెనడా, మెక్సికోల నుంచి విదేశీయులెవరూ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. అన్ని వీసా సేవలను నిలిపేసింది. కరోనా కారణంగా అమెరికా ఆర్థికంగా భారీగా దెబ్బ తిన్నది. ఇప్పటికే 2.2 కోట్ల మంది అమెరికన్లు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అన్ని రకాల వలసలపై తాత్కాలికంగా నిషేధం
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : అమెరికా డొనాల్డ్ ట్రంప్
ఎందుకు: అమెరికన్ల ఉద్యోగాలకు భద్రత కల్పించేందుకు

జాతీయం
జూమ్ సురక్షితమైనది కాదు: కేంద్రం
Current Affairs
లాక్‌డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ కోసం వ్యక్తులు, సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్న ‘జూమ్’ప్లాట్‌ఫామ్ అంత సురక్షితమైనది కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ సంస్థలు అధికారిక సమావేశాల కోసం దీన్ని వినియోగించవద్దని కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 16న ప్రకటించింది. దీనికి సంబంధించిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) హెచ్చరికను సైబర్ కోఆర్డినేషన్ కేంద్రం నిర్ధారించింది. అధికారిక సమావేశాల కోసం అధికారులు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించవద్దని స్పష్టం చేసింది. అలాగే, జూమ్‌ను వినియోగించే ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల కోసం కొన్ని సూచనలు చేసింది.

కరోనా బాధితులకు ప్లాస్మా చికిత్స: ఢిల్లీ సీఎం
కరోనా సోకిన వారికి త్వరలోనే ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్ అందించేందుకు ట్రయల్స్ ప్రారంభించామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16న ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. రాబోయే 3-4 రోజుల్లో దీనికి సంబంధించిన ట్రయల్స్ ప్రారంభమవుతుందని, ఇది విజయవంతమైతే త్వరలోనే కరోనా రోగులకు ఈ విధమైన చికిత్స అందిస్తామని వెల్లడించారు.
కరోనా నివారణకు మందు ఇంతవరకు ఎవరు కనుక్కొలేదు. ప్లాస్మా థెరపీలో కరోనా సోకి కోలుకున్న వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్రమంలో కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగులను బతికించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో సక్సెస్ కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో కూడా ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేరళకు అనుమతిచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా సోకిన వారికి త్వరలోనే ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

టైమ్స్ ర్యాంకింగ్స్ లో పాల్గొనం: ఐఐటీలు
ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఇచ్చే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్‌ఈ) ర్యాంకింగ్స్ ను ఈ సంవత్సరం(2020) బహిష్కరిస్తున్నట్లు భారత్‌లోని ఏడు ప్రఖ్యాత ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు ప్రకటించాయి. ఉత్తమ విద్యా సంస్థలుగా ప్రకటించేందుకు టీహెచ్‌ఈ అనుసరిస్తున్న ప్రక్రియ పారదర్శకంగా లేదని విమర్శించాయి. బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీలు ఏప్రిల్ 16న ఉమ్మడిగా ఈ ప్రకటన చేశాయి. ‘ఈ సంవత్సరం ర్యాంకింగ్‌‌సలో ఈ ఏడు ఐఐటీలు పాల్గొనడం లేదు. ర్యాంకింగ్ ప్రక్రియ విధి, విధానాలు, పారదర్శకతపై టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు సంతృప్తికర వివరణ ఇస్తే 2021 సంవత్సర ర్యాంకింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తాం’అని స్పష్టం చేశాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020 టైమ్స్ ర్యాంకింగ్స్ లో పాల్గొనం
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : భారత్‌లోని ఏడు ప్రఖ్యాత ఐఐటీలు
ఎందుకు: ఉత్తమ విద్యా సంస్థలుగా ప్రకటించేందుకు టీహెచ్‌ఈ అనుసరిస్తున్న ప్రక్రియ పారదర్శకంగా లేదని

ఆర్థిక మంత్రితో ప్రధాని మోదీ సమావేశం
కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశంపై చర్చించారు. అలాగే భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చలు జరిపారు.
2020-21లో భారత్ వృద్ధి 1.1 శాతం: ఎస్‌బీఐ
కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 1.1 శాతానికి పడిపోయే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏప్రిల్ 16న వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు: కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు

ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 29 కోట్ల టన్నులు
2020-21 పంట ఏడాదిలో (జులై-జూన్) ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 29.83 కోట్ల టన్నులుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్దేశించుకుంది. జూన్-సెప్టెంబరు మధ్య సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2020-21 పంట ఏడాది ఖరీఫ్‌లో 14.99 కోట్ల టన్నులు, రబీలో 14.84 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యం విధించుకున్నట్లు వ్యవసాయ కమిషనర్ ఎస్‌కే మల్హోత్రా వెల్లడించారు.
మోదీ ప్రసంగానికి వీక్షకులు 20 కోట్లు
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా టీవీల్లో 20.3 కోట్ల మంది వీక్షించారని బార్క్(బ్రాడ్‌కాస్ట్ ఆడిఝెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) వెల్లడించింది. మొదటి లాక్‌డౌన్ ప్రకటన సమయంలో దేశవ్యాప్తంగా 19.3 కోట్ల మంది టీవీల్లో ప్రధాని ప్రకటనను వీక్షించినట్లు బార్క్ తెలిపింది. దీంతో తన రికార్డును తానే అధిగమించారని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020-21 పంట ఏడాదిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 29 కోట్ల టన్నులు
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
పారాసిటమాల్ మాత్రల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఈ మాత్రలు కీలకంగా పనిచేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మందులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నందున ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఏప్రిల్ 17న కేంద్ర విదేశీ ఎగుమతుల డెరైక్టర్ జనరల్ అమిత్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పారాసిటమాల్‌లో వినియోగించే ముడి సరుకు ఎగుమతులపై మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: ప్రస్తుతం దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నందున

వ్యవసాయోత్పత్తుల రవాణాకు కిసాన్ రథ్ యాప్
వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ పోర్ట్ అగ్రిగేటర్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘కిసాన్ రథ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏప్రిల్ 17న ఆవిష్కరించారు. వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు 5 లక్షల ట్రక్కులు, 20 వేల ట్రాక్టర్లు ఈ మొబైల్ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘లాక్‌డౌన్ సమయంలో రైతుల తమ ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రక్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మండీలు, ఇతర మార్కెట్లకు తరలించడానికి కిసాన్ రథ్ యాప్ ఉపయోగపడుతుంద’ని అధికారులు తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించడానికి కొద్దిరోజుల క్రితం ఇండియా అగ్రి ట్రాన్స్ పోర్ట్ కాల్ సెంటర్‌ను మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వ్యవసాయోత్పత్తుల రవాణాపై కాల్ సెంటర్
దేశంలో రాష్ట్రాల మధ్య పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇతర వ్యవసాయోత్పత్తుల రవాణా సులభతరం చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 14488 నంబర్‌లోగానీ, 18001804200 నంబర్‌లో గానీ కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కిసాన్ రథ్ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఎందుకు: వ్యవసాయోత్పత్తుల రవాణాకు

కరోనా మహమ్మారిపై పోరుకు కోవిడ్ వారియర్స్
కరోనాపై పోరాటంలో రాష్టాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డేటాబేస్‌ను ఏర్పాటు చేసింది. ఆయుష్ వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, నెహ్రూ యువకేంద్ర సభ్యులు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ సభ్యులు, ప్రధానమంత్రి కౌషల్ వికాస్ యోజన సభ్యుల, వాలంటీర్ల పేర్లు, వివరాలతో ఈ డేటాబేస్ సిద్ధమైంది. కోవిడ్ వారియర్స్ అని పిలిచే వీరి సేవలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు, రేషన్ దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో భౌతిక దూరాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనాథలకు సేవలందించేందుకు వాడుకోవచ్చు. https://covidwarriors.gov.in వెబ్‌సైట్‌లో కొవిడ్ యోధుల సమాచారం అందుబాటులో ఉంటుందని కేంద్ర సర్కారు వెల్లడించింది. అలాగే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సాంకేతిక సిబ్బంది, స్వచ్ఛంద సేవలకు శిక్షణ ఇచ్చేందుకు https://igot.gov.in/igot అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు
ఎప్పుడు:ఏప్రిల్ 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు: కరోనాపై పోరాటంలో రాష్టాలకు సహకరించేందుకు

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు నిధులు
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ) మూడు కంపెనీలను నిధులు అందజేయనుంది. ఇందుకోసం క్యాడిలా హెల్త్‌కేర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలను ఎంపిక చేసింది. భారత్ బయోటెక్ ‘ఇన్‌యాక్టివేటెడ్ రేబీస్ వెక్టార్ ప్లాట్‌ఫామ్’ను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేయనుంది. వైద్య పరికరాల తయారీకి మరో 13 కంపెనీలను కూడా డీబీటీ ఎంపిక చేసింది. ఈ 13 సంస్థలకు కూడా డీబీటీ ఆర్థిక సాయం చేయనుంది. నేషనల్ బయోఫార్మా మిషన్ నుంచి నిధులను అందించి, ఒక పరిశోధనా కన్సార్షియం ద్వారా వివిధ దశల్లో వీటి అభివృద్ధిని పరిశీలించనున్నట్లు డీబీటీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు నిధులు
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎవరు : డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ)

చైనా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వాడొద్దు: ఐసీఎంఆర్
కరోనా వైరస్ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్ టెస్టింగ్ కిట్స్’ను రెండు రోజుల పాటు వాడవద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఏప్రిల్ 21న రాష్ట్రాలను కోరింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామంది. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్‌కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్‌ను సరఫరా చేయాలని కోరుతామన్నారు.
5.4 శాతం మాత్రమే..
చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్ ప్రకటించింది. ఆ కిట్స్ ద్వారా జరిపిన పరీక్షల్లో 90 శాతం సరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4 శాతం మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తెలిపింది.
రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కు ఆమోదం
ఇప్పటివరకు చేస్తున్న పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) పరీక్షల్లో గొంతు, ముక్కులో నుంచి తీసిన శాంపిల్‌ను పరీక్షించి, కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తారు. అయితే, ఈ విధానంలో ఫలితాలు వచ్చేందుకు 5- 6 గంటల సమయం పడుతుంది. కానీ రక్త పరీక్ష ద్వారా జరిపే రాపిడ్ యాంటీబాడీ టెస్ట్‌లో ఫలితం అరగంటలోపే వచ్చేస్తుంది. హాట్‌స్పాట్స్‌లో ఈ ర్యాపిడ్ టెస్టింగ్ విధానాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వాడొద్దు
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)
ఎందుకు: ఆ కిట్స్ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో

యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
యూరియాయేతర ఎరువులపై సబ్సిడీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ నిర్ణయం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాపై ఎరువుల సబ్సిడీ భారం రూ. 22,186.55 కోట్లకు తగ్గనుంది. ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులపై సబ్సిడీ రేట్లను నిర్ణయించేందుకు ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు. నైట్రోజన్‌పై సబ్సిడీని కేజీకి రూ. 18.78కి, పొటాష్‌పై సబ్సిడీని కేజీకి రూ. 10.11కి, పాస్ఫరస్‌పై సబ్సిడీని కేజీకి రూ. 14.88కి, సల్ఫర్‌పై సబ్సిడీని కేజీకి రూ. 2.37కి తగ్గించినట్లు ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇది నైట్రోజన్‌పై రూ. 18.90గా, పొటాష్‌పై రూ. 11.12గా, ఫాస్ఫరస్‌పై రూ. 15.21గా, సల్ఫర్‌పై రూ. 3.56గా ఉంది. అలాగే, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ(ఎన్‌బీఎస్) ఎరువుల జాబితాలోకి అమ్మోనియం ఫాస్ఫేట్‌ను చేర్చాలన్న ప్రతిపాదనకు సీసీఈఏ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ తగ్గింపు
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు : ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల జైలు
వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 22న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.
కొత్త చట్టం ప్రకారం..
మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని మంత్రి జవదేకర్ వివరించారు. ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్-19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఎపిడమిక్ డిసీజెస్ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు: ఏప్రిల్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు: కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కోవిడ్-19 అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో

ప్రాంతీయం
ఏపీకి దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లు

Current Affairs కోవిడ్- 19 నివారణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేకంగా చార్టర్డ్ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్ 17న తన క్యాంపు కార్యాలయంలో ఈ కిట్లను ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ కోవిడ్-19 నివారణా చర్యలపై సమీక్షించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయో సెన్సార్ కంపెనీ ఈ కిట్లను ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఈ కిట్లకు ఐసీఎంఆర్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల టెస్టు కిట్లను ఆర్డర్ చేసిందని, రానున్న రోజుల్లో వీటిని అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. సాంకేతిక పరమైన సహకారాన్ని కూడా ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు.
ట్రూనాట్ కిట్లతోనూ..
రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల కోసం ఇప్పటికే ట్రూనాట్ కిట్లను ఉపయోగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ట్రానాట్ కిట్లు మన దగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. సుమారు 240కి పైగా కిట్లను ఉపయోగించుకోవడం వల్ల పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. అందువల్లే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగానికి ముందే దేశంలో జానాభా ప్రాతిపదికన అత్యధిక కోవిడ్- 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది.
ముఖ్యమంత్రికి కోవిడ్-19 టెస్ట్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా వైద్యులు ఆయనకు పరీక్ష చేసి, నెగిటివ్‌గా నిర్ధారించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లు
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు: కోవిడ్- 19 నివారణ చర్యల కోసం

కరోనా పరీక్షల్లో ఏపీకి రెండో స్థానం
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండోస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఏపీ కంటే ముందు వరుసలో ఉన్న కేరళను వెనక్కినెట్టి 2వ స్థానానికి చేరుకుంది.

  • జాతీయ సగటులో మిలియన్ జనాభాకు 268 మందికి పరీక్షలు చేస్తుండగా.. ఏపీలో మాత్రం 539 పరీక్షలు చేస్తున్నారు.
  • ఒక్క రాజస్థాన్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకంజలోనే ఉన్నాయి.
  • పెద్ద రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ మాత్రం చాలా వెనుకబడి ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఏప్రిల్ 19న విడుదల చేసిన గణాంకాలను బట్టి తేలింది.
  • బెంగాల్‌లో మిలియన్ జనాభాకు 51 మందికే పరీక్షలు చేస్తున్నారు.

తాజా గణాంకాల ప్రకారం మిలియన్ జనాభాకు 300కు పైగా పరీక్షలు చేసిన రాష్ట్రాలు..

Current Affairs


క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా పరీక్షల్లో రెండో స్థానం
ఎప్పుడు:ఏప్రిల్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ:దేశంలో

కరోనా పరీక్షల కోసం మొబైల్ వైరాలజీ ల్యాబ్
ఇప్పటివరకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ల్యాబ్‌లకే పరిమితం కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మొబైల్ వైరాలజీ కంటెయినర్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో బీఎస్‌ఎల్-3 ల్యాబ్‌ను నిమ్స్, డీఆర్డీఓ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. ఈ ల్యాబ్ రూపకల్పన, డిజైన్‌ను నిమ్స్ ఆస్పత్రి రీసెర్చ్ డెవలప్‌మెంట్ అధిపతి డాక్టర్ మధుమోహన్‌రావు అందించగా, ఈఎస్‌ఐ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్ దీనికి సంపూర్ణ సహకారం అందించారు. 2020, ఏప్రిల్ 22 లేదా 23 తేదీల్లో తొలుత ఈ ల్యాబ్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆవరణలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ల్యాబ్‌కు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల బృందం సభ్యులు డాక్టర్ వై.శ్రీనివాస్, ఎంఎస్‌ఆర్ ప్రసాద్, బీఎల్‌వీఎస్ నారాయణమూర్తి మొబైల్ కంటెయినర్ నిర్మాణానికి కావాల్సిన సాంకేతికతను అందించారు. దీనికి కావాల్సిన రెండు భారీ కంటెయినర్లను ఐకామ్ సంస్థ ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. ఈ కంటెయినర్లలో బయోసేఫ్టీ లెవల్ (బీఎస్‌ఎల్)-3 ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలను కేవలం 15 రోజుల్లో సిద్ధం చేసింది. సాధారణంగా ఇలాంటి ల్యాబ్‌ను రూపొందించాలంటే కనీసం ఆర్నెల్ల సమయం పడుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అందుబాటులోకి మొబైల్ వైరాలజీ కంటెయినర్ ల్యాబ్
ఎప్పుడు:ఏప్రిల్ 19
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం

గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) ఏప్రిల్ 20న ప్రారంభమైంది. 1,500 బెడ్‌లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను సిద్దం చేశారు. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇందులో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్పత్రిని సిద్ధం చేయడంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయగా, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిరంతరం పర్యవేక్షించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ:గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనం, హైదరాబాద్
ఎందుకు: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో

ఆర్‌బీఐ నుంచి తెలంగాణకు 2 వేల కోట్ల రుణం
లాక్‌డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న మరో రూ.2 వేల కోట్లను రుణంగా తీసుకుంది. స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (ఎస్‌డీఎల్) కింద బాండ్ల అమ్మకాలు, సెక్యూరిటీల ద్వారా ఈ రుణాన్ని పొందింది. మొత్తం 6 రాష్ట్రాలు ఆర్‌బీఐ నిర్వహించిన వేలంలో పాల్గొన్నాయి. రాష్ట్రం తీసుకున్న రుణంలో వెయి్య కోట్ల రూపాయలను 2026కు, మరో రూ.వెయి్య కోట్లను 2028 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 2020, ఏప్రిల్ 13వ తేదీన కూడా ప్రభుత్వం బాండ్ల అమ్మకాల ద్వారా రూ.2 వేల కోట్లు ఆర్‌బీఐ నుంచి అప్పుగా తీసుకుంది. దీంతో ఏప్రిల్ నెలలోనే రూ.4 వేల కోట్ల రుణం తీసుకున్నట్లు అయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆర్‌బీఐ నుంచి 2 వేల కోట్ల రుణం
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎవరు:తెలంగాణ
ఎందుకు: లాక్‌డౌన్ నేపథ్యంలో

దేశీయ థర్మామీటర్, ఫేస్ మాస్క్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ లాబ్స్ రూపొందించిన ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లను ఏప్రిల్ 22న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ మాస్క్, థర్మామీటర్ పని తీరును ఏపీ మెడ్‌టెక్ జోన్‌కు చెందిన గ్రీన్ ఓషన్ రీసెర్చ్ ల్యాబ్స్ డెరైక్టర్స్ ఏ శృతి, ఎం సాయిరాం ముఖ్యమంత్రికి వివరించారు.

  • తొలిసారి దేశీయంగా ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌లు తయారు చేస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో స్థానికంగా ఉన్న ఉద్యోగులతోనే ఈ పరికరాలను తయారు చేస్తున్నామని వెల్లడించారు.
  • కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులతోనే ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
  • ప్రస్తుతం రోజుకు 1,000 థర్మామీటర్లు తయారు చేస్తున్నామని, మన రాష్ట్ర అవసరాల అనంతరం త్వరలోనే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా ఉత్పత్తిని పెంచుతామని వారు ముఖ్యమంత్రికి వివరించారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇన్ ఫ్రా రెడ్ నాన్ కాంటాక్ట్ ఫోర్ హెడ్ థర్మామీటర్, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్క్‌ల ఆవిష్కరణ
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ: సీఎం క్యాంపు కార్యాలయం, ఆంధ్రప్రదేశ్

ద్వైపాక్షికం
హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో ఏరోస్ విలీనం
Current Affairs
కోవిడ్ -19 మహమ్మారి విస్తరణతో ప్రపంచ మార్కెట్లలో మొత్తం సినిమా నిర్మాణ రంగం సంక్షోభంలో వుండగా హాలీవుడ్‌కు చెందిన ఎస్‌టీఎక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం అవుతున్నట్టు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ఏప్రిల్ 18న ప్రకటించింది. మొత్తం షేర్ల రూపంలో ఈ విలీనం జరగనుంది. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఎస్‌టిఎక్స్ సంస్థ ఇప్పటికే హాలీవుడ్‌లో 34 సినిమాలు నిర్మించింది. ఇందులో హస్లర్స్, బాడ్ మామ్స్ సినిమాలు రెండూ కలిసి 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.10,500 కోట్లు) గ్రాస్‌ను వసూలు చేశాయి.
సీఈఓగా రాబర్ట్..
11 సంవత్సరాల క్రితం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ కరోనా వైరస్ కాలంలో కొత్త అవతారాన్ని దాల్చింది. బద్లాపూర్, బజరంగీ భైజాన్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలను నిర్మించిన ఏరోస్ ఇంటర్నేషనల్, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో హాలీవుడ్ కంపెనీతో కలిసి ఈరోస్ ఎస్టీఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్ పేరుతో గ్లోబల్ సంస్థగా అవతరించింది. అలాగే రెండు కంపెనీల విలీనం తరువాత కంపెనీ ఫౌండర్ ప్రస్తుత సీఈఓ కిషోర్ లుల్లా ఎగ్జిక్యూటివ్ కో-చైర్మన్‌గా, ఎస్‌టిఎక్స్ సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ సిమండ్‌‌స కొత్త కంపెనీకి సీఈఓగా వ్యవహరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హాలీవుడ్ సంస్థ ఎస్‌టీఎక్స్‌తో విలీనం
ఎప్పుడు: ఏప్రిల్ 18
ఎవరు : బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్

ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో భారత జాతీయ పతాకం
కరోనాపై పోరులో భారత్‌కు స్విట్జర్లాండ్ వినూత్న రీతిలో సంఘీభావం తెలిపింది. భారతీయుల్లో విశ్వాసం పాదుకొల్పి, నైతిక స్థైర్యం అందించేందుకు ప్రఖ్యాత
ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో ఒకటైన మాటర్‌హార్న్ పర్వతంపై ఇలా మువ్వన్నెల కాంతులను ప్రసరింపజేసింది. స్విస్ కళాకారుడు గెర్రీ హాఫ్స్‌టెటర్ 4,478 మీటర్ల ఎత్తైన మాటర్‌హార్న్ పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకంతో కూడిన కాంతులను ప్రసరింపజేశారు. స్విస్ సంఘీభావంపై ప్రధాని మోదీ ఏప్రిల్ 18న ట్విట్టర్‌లో స్పందించారు. కరోనాపై యావత్ ప్రపంచం కలసికట్టుగా పోరాడుతోందని, ఈ మహమ్మారిపై మానవజాతి విజయం సాధించి తీరుతుందని ట్వీట్ చేశారు.
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్: ఆక్స్‌ఫర్డ్
2020, మే నెలలోపు 500 మందిపై కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. 18- 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షించనున్నారు. 2020 అక్టోబర్ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్, యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్ దశ నుంచి క్లినికల్ ట్రయల్స్ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్ బృందం ప్రయోగం మొదటిది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆల్ఫ్స్ పర్వతశ్రేణుల్లో భారత జాతీయ పతాకం
ఎప్పుడు:ఏప్రిల్ 18
ఎవరు : స్విస్ కళాకారుడు గెర్రీ హాఫ్స్‌టెటర్
ఎక్కడ:మాటర్‌హార్న్ పర్వతం, ఆల్‌‌పస్ పర్వతశ్రేణులు
ఎందుకు: కరోనాపై పోరులో భారత్‌కు వినూత్న రీతిలో సంఘీభావం

చైనా తాజా మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్
భారత్‌లో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశంలో అంతర్భాగమని పదే పదే వివాదాస్పద ప్రకటనలు చేస్తున్న చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను టిబెట్‌లో భాగంగా చూపింది. ఈ మేరకు డిజిటల్ మ్యాప్‌లకు సంబంధించి చైనా అధికారిక సంస్థ స్కై మ్యాప్ నవీకరించిన మ్యాప్‌ను విడుదలచేసింది. స్కై మ్యాప్ బీజింగ్ నేషనల్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ జియోగ్రఫిక్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1951లో టిబెట్‌ను ఆక్రమించిన చైనా.. అరుణాచల్‌ప్రదేశ్ కూడా అందులో భాగమని వాదిస్తూ వస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా తాజా మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : చైనా అధికారిక సంస్థ స్కై మ్యాప్

ఆర్థికం
2020లో ఆసియా వృద్ధి జీరో: ఐఎంఎఫ్
Current Affairs
కోవిడ్-19 నేపథ్యంలో 2020లో ఆసియా వృద్ధిరేటు ‘జీరో’గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. దాదాపు 60 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితి ఇదని పేర్కొంది. అయితే ఆర్థిక క్రియాశీలత విషయంలో ఇతర ఖండాలతో పోల్చితే ఆసియా పరిస్థితి మెరుగ్గానే ఉండే వీలుందని కూడా ఐఎంఎఫ్ పేర్కొంది. ‘‘కోవిడ్-19 మహమ్మారి- ఆసియా-పసిఫిక్ ప్రాంతం’ అన్న శీర్షికతో ఒక బ్లాక్‌లో ఐఎంఎఫ్ ఈ వివరాలను వెల్లడించింది. కరోనా వైరస్ ప్రభావం ఆసియాలో తీవ్రంగా, మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 1997 ఆసియన్ ఫైనాన్షియల్ సంక్షోభంలో వృద్ధి ఆసియా వృద్ధి 1.3 శాతంగా ఉంటే, 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిరేటు 4.7 శాతంగా ఉన్న విషయాన్ని ఐఎంఎఫ్ ప్రస్తావించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020లో ఆసియా వృద్ధి జీరో
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
ఎందుకు: కోవిడ్-19 నేపథ్యంలో

ఆర్థిక వృద్ధికి ఆర్‌బీఐ రెండో ప్యాకేజీ
దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకొన్న నెలరోజుల్లోపే ఏప్రిల్ 17న మరో ప్యాకేజీని అందించింది. ముఖ్యంగా బ్యాంకులు మరింత ఉత్సాహంగా రుణాలు మంజూరు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ... లిక్విడిటీ కవరేజీ రేషియోను 80 శాతానికి సవరించింది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ పెరిగేలా చర్యలు చేపట్టింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రెండో ప్యాకేజీ నిర్ణయాలను ప్రకటించారు.
ఎన్‌పీఏల వర్గీకరణకు 180 రోజులు
రుణ చెల్లింపుల్లో విఫలమైతే 90 రోజుల తర్వాత దాన్ని వసూలు కాని ఎన్‌పీఏ వర్గీకరించాలన్నది ప్రస్తుత నిబంధన. అయితే లాక్‌డౌన్ కారణంగా రుణ చెల్లింపులపై 3 నెలల మారటోరియంను ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. ఫలితంగా మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్న ఖాతాలకు ఇది 180 రోజులుగా అమలు కానుంది. 2020, మార్చి 1 నాటికి చెల్లింపుల్లో విఫలం కాకుండా ఉన్న రుణ ఖాతాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. మారటోరియం వెసులుబాటు ఎన్‌పీఏలకు దారితీయకూడదని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
రివర్స్ రెపో పావు శాతం కోత
రివర్స్ రెపో రేటును పావు శాతం తగ్గించి ప్రస్తుతమున్న 4 శాతం నుంచి 3.75 శాతానికి సవరించింది. రివర్స్ రెపో అంటే... బ్యాంకులు తన వద్ద ఉంచే నిధులకు ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గటం వల్ల బ్యాంకులు తమ నిధుల్ని ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేయడానికి బదులు రుణాలివ్వటానికే మొగ్గు చూపిస్తాయి. బెంచ్‌మార్క్ రెపో రేటు 4.40 శాతంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
ఎల్‌సీఆర్ కోత
లిక్విడిటీ కవరేజీ రేషియోను (ఎల్‌సీఆర్) 100 శాతం నుంచి 80 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ఎల్‌సీఆర్ అంటే... ఏ క్షణంలోనైనా నగదుగా మార్చుకోగలిగే స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్ల వంటి ఆస్తులు. 2020 అక్టోబర్ నాటికి తిరిగి దీనిని 90 శాతానికి, 2021, ఏప్రిల్ 1కి 100 శాతానికి తీసుకొస్తామని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
రాష్ట్రాలకు మరిన్ని నిధులు..
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ సదుపాయం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం మేర అదనంగా ఆర్‌బీఐ నుంచి రుణాలను పొందేందుకు రిజర్వు బ్యాంకు అనుమతించింది. ఈ సదుపాయం 2020, సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయ, వ్యయాల మధ్య అంతరాలను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకునేందుకు ఏర్పాటు చేసిందే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్.
ఆర్థిక సంస్థలకు మరో రూ.50వేల కోట్లు
జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలైన నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు మరో రూ.50,000 కోట్ల మేర రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని ఆర్‌బీఐ కల్పించింది. ఈ సంస్థలు ఆర్‌బీఐ అనుమతించిన నిర్దేశిత సాధనాల ద్వారా మార్కెట్ల నుంచి నిధులను సమీకరించుకోవచ్చు. ఒక్క నాబార్డ్‌కే రూ.25,000 కోట్లు అందించనుంది. వీటిని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, సూక్ష్మ రుణ నంస్థలకు నాబార్డ్ అందించనుంది.
వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్ల నగదు
మార్చి 1 - ఏప్రిల్ 14 మధ్య వ్యవస్థలోకి ఆర్‌బీఐ ఏకంగా రూ.1.2 లక్షల కోట్ల నగదును విడుదల చేసింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వ్యవస్థలో నగదుకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసి ఈ విధానాన్ని అనుసరించింది.
మరికొన్ని నిర్ణయాలు..

  • ఎన్‌బీఎఫ్‌సీ, మైక్రో ఫైనాన్స్ రంగం నిధుల కొరత ఎదుర్కోవచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం కోసం లక్ష్యిత దీర్ఘకాల రెపో ఆపరేషన్స్ (టీఎల్‌టీఆర్‌వో 2.0) రూపంలో రూ.50,000 కోట్ల మేర నిధుల్ని ఆర్‌బీఐ అందించనుంది.
  • అన్ని వాణిజ్య, కో-ఆపరేటివ్ బ్యాంకులు తమ వాటాదారులకు, ప్రమోటర్లకు డివిడెండ్ చెల్లింపులు చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది.
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ అంచనా. 2019-20లో 1.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉంది.


జియోలో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు
దిగ్గజ సంస్థలు రిలయన్స్ గ్రూప్, ఫేస్‌బుక్ తాజాగా దేశీ టెక్నాలజీ రంగంలో భారీ డీల్‌కు తెరతీశాయి. రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఏప్రిల్ 22న వెల్లడించింది. ఈ డీల్ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 43,574 కోట్లు) ఉండనుంది. ఫేస్‌బుక్‌లో భాగమైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఊతంతో దేశీ ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోయేందుకు ఈ డీల్ రిలయన్స్ కు తోడ్పడనుండగా.. భారత మార్కెట్లో మరింత చొచ్చుకుపోయేందుకు ఫేస్‌బుక్‌కు కూడా ఉపయోగపడనుంది. అలాగే 2021 నాటికల్లా రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్ష్యం సాకారం కావడానికి కూడా తోడ్పడనుంది. 2014లో వాట్సాప్ కొనుగోలు డీల్ తర్వాత ఫేస్‌బుక్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం.
డీల్ ఇలా..
తాజా ఒప్పందం ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్.. ఫేస్‌బుక్‌కు కొత్తగా షేర్లు జారీచేయడంతో పాటు బోర్డులో స్థానం కూడా కల్పిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కూడా బోర్డులో ఉంటారు. తమ డిజిటల్ వ్యాపారాలన్నింటినీ కలిపి రిలయన్స్ గ్రూప్ గతేడాది అక్టోబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 15,000 కోట్లను ఇది తన దగ్గరే అట్టిపెట్టుకుని, మిగతా మొత్తాన్ని సుమారు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల్లో కొంత తీర్చేందుకు ఉపయోగించుకుంటుంది. ఇది నాన్-ఎక్స్‌క్లూజివ్ డీల్‌గా ఉండనుంది. అంటే జియోతో మాత్రమే కాకుండా ఇతరత్రా భారత, విదేశీ కంపెనీలతో కూడా కావాలనుకుంటే ఫేస్‌బుక్ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఈ ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతులు తెలపాల్సి ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా జియోమార్ట్..
తాజా డీల్ సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్‌ఐఎల్ వివరించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు రావాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాలు కొనుగోలు
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు : సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్

ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్ ఏర్పాటు
కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజ్’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 22న ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోవిడ్‌చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు. ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్ వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజ్ ఏర్పాటు
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు: కేంద్ర కేబినెట్
ఎందుకు: కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం

సైన్స్ అండ్ టెక్నాలజీ
కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్ తయారు
Current Affairs
కోవిడ్-19 బాధితులకు సేవలందించేందుకు పంజాబ్‌లోని రోపార్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) శాస్త్రవేత్తలు ప్రత్యేక రోబోట్‌ను తయారు చేశారు. ఆసుపత్రుల్లో వార్డ్‌బోట్‌ల వాడకం ద్వారా వైద్యసిబ్బంది వైరస్ బారిన పడటాన్ని తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి రోగులకు మందులు, ఆహారం అందివ్వగలవని అసోసియేట్ ప్రొఫెసర్ ఎక్తా సింగ్లా తెలిపారు. ఇవి చేతులు ఊపడం వంటి సంజ్ఞలను అర్థం చేసుకోగలవని వివరించారు. కంట్రోల్ రూం ద్వారా ఏకకాలంలో వేర్వేరు వార్డుల్లోని రోబోలను నియంత్రించడం, ఆదేశాలివ్వడం సాధ్యమని... తరచూ తనని తాను శానిటైజర్ ద్వారా శుభ్రం చేసుకోవడం వార్డుబోట్‌కు ఉన్న మరో ప్రత్యేకత అని తెలిపారు.
రెండు గంటల్లోనే కరోనా పరీక్ష
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసే డయాగ్నొస్టిక్ కిట్‌ను కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ చెప్పారు. ఈ కిట్‌తో కేవలం 2 గంటల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక యంత్రంపై ఒకేసారి 30 నమూనాలను పరీక్షించవచ్చని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కోవిడ్ బాధితుల కోసం వార్డ్‌బోట్ తయారు
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : ఐఐటీ రోపార్
ఎందుకు: కోవిడ్-19 బాధితులకు సేవలందించేందుకు

కరోనా కట్టడిలో డీఆర్‌డీవో కీలక ముందడుగు
కరోనా కట్టడికి భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో) మరో కీలక ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌తో సహా మరో రెండు ఉత్పత్తులను అభివృద్ధి చేసిందని అధికారులు ఏప్రిల్ 18న తెలిపారు. ముఖ్యంగా అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్, చేతితో తాకే అవసరం లేకుండానే ఉపయోగించే యూవీసీ శానిటైజర్ క్యాబినెట్‌ను అభివృద్ధి చేసింది.
ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ సంస్థతో కలిసి అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. దీంతోపాటు ఢిల్లీలోని డిఫెన్స్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సెన్సైస్ (డిపాస్) ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సెన్సైస్ తో కలిసి అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్ యూవీ-సీ(254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం)ని రూపొందించింది. తద్వారా రసాయనాలను ఉపయోగించి శుభ్రపరచలేని ఏ వస్తువునైనా శుభ్రపరచడానికి ఇది ఉపయోగ పడుతుంది. చెక్కులు, పాస్‌బుక్‌లు, పేపర్ కవర్లులాంటి రోజవారీ వినియోగించే వస్తువుల నుంచి కరోనా వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఈ కిరణాలు కరోనా వైరస్ లోనిని జన్యు పదార్ధాలను నాశనం చేయడంలో, పునరుత్పత్తిని నిరోధిచండంలో చాలా బాగా పనిచేస్తాయిని డీఆర్‌డీవో తెలిపింది.

కరోనా చికిత్సకు ఐకో వెంట్ వెంటిలేటర్
కరోనా రోగుల కోసమే దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన వెంటిలేటర్.. ‘ఐకో వెంట్’ పేరుతో మార్కెట్‌లోకి రానుంది. అందుబాటులో ఉన్న పరికరాలు, తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ వెంటిలేటర్ కరోనా బారినపడిన రోగులపై బాగా పనిచేస్తుందని దీని రూపకర్త, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏప్రిల్ 21న తెలిపారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదని, తమ ఐకో వెంట్ వెంటిలేటర్లు ఆ కొరతను తీర్చబోతున్నాయని చెప్పారు. ఐకో వెంట్‌ను కరోనా, న్యుమోనియా, ఏఆర్‌డీఎస్ (ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిం డ్రోమ్) రోగుల కోసమే రూపొందించామన్నారు. ఊపిరితిత్తుల సాధారణ సామర్థ్యం ఆధారంగా ఆక్సిజన్‌ను కచ్చిత పరిమాణంలో ఊపిరితిత్తుల్లోకి పంపి, బయటకు వదిలే క్రమంలో కచ్చితమైన ప్రెషర్‌ను ఇది అనుమతిస్తుందన్నారు.
చైనా వైద్యులకు కరోనా టీకా
కరోనా వైరస్ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాను ఏడాది చివరిలోగా కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులకు అందించాలని చైనా యోచిస్తోంది. సాధారణ పద్ధతుల్లో తయారు చేస్తే 2020, ఏడాది చివరికి టీకా అందుబాటులోకి రాదని, అయితే ఈ మధ్యలో పరిస్థితి విషమిస్తే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందికి దీన్ని వాడతామని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డెరైక్టర్ గావ్ ఫూ తెలిపారు. చైనా అకాడమీ ఆఫ్ మిలటరీ సెన్సైస్ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ మెడిసిన్ ఓ అడినోవైరస్ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది. మార్చి నెలాఖరుకు తొలిదశ ప్రయోగాలు పూర్తి కాగా, ఏప్రిల్ 12న రెండో దశ ప్రయోగాలు మొదలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐకో వెంట్ వెంటిలేటర్ రూపకల్పన
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఎందుకు: కరోనా చికిత్సకు

క్రీడలు
ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం
Current Affairs
ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. ‘ఫ్లవర్ సిటీ’గా పేరున్న గ్వాంగ్జౌ నగరంలో కమలం ఆకారంలో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. చైనా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్ అయిన ‘గ్వాంగ్జౌ ఎవర్‌గ్రాండ్’ టీమ్ యాజమాన్యం దీని రూపకర్త. ఈ జట్టు 2022లోగా దీనిని పూర్తి చేసి తమ హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగించుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్దదైన బార్సిలోనా ఎఫ్‌సీ ‘క్యాంప్ నూ’ స్టేడియంకు మించి దాదాపు లక్షకు పైగా సామర్థ్యంతో కొత్త స్టేడియం నిర్మితమవుతోంది. ఏప్రిల్ 16న దీని పనులు ప్రారంభం కాగా మొత్తం బడ్జెట్ 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు).
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : చైనా
ఎక్కడ:గ్వాంగ్జౌ, చైనా

దక్షిణాఫ్రికా క్రికెట్ డెరైక్టర్‌గా గ్రేమ్ స్మిత్
క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) పూర్తిస్థాయి డెరైక్టర్‌గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఏప్రిల్ 17న నియమితులయ్యాడు. 2019, డిసెంబర్ నుంచి తాత్కాలిక డెరైక్టర్‌గా వ్యవహరిస్తోన్న 39 ఏళ్ల స్మిత్ రానున్న రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌ఏ తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫౌల్ ప్రకటించారు. తాత్కాలిక డెరైక్టర్‌గా ఆరునెలల పని కాలంలో కఠిన శ్రమ, అనుభవం, అంకితభావంతో స్మిత్ అద్భుత ఫలితాలు సాధించాడని జాక్వెస్ కొనియాడారు. స్మిత్ 2003-14 మధ్య కాలంలో 117 టెస్టులు, 197 వన్డేలు, 33 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 108 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పూర్తిస్థాయి డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న గ్రేమ్ స్మిత్ వచ్చీరాగానే మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం సఫారీ టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి డికాక్‌ను తప్పిస్తున్నట్లు పేర్కొన్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్

లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ వాయిదా
టీమ్ యూరోప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ప్రతి యేటా జరిగే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను 2021 ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తెలిపాడు. ఫెడరర్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ టోర్నీ జరుగుతోంది. 2020 ఏడాది బోస్టన్‌లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య లేవర్ కప్ జరగాల్సింది. అయితే మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు. దాంతో 2020 లేవర్ కప్‌ను వాయిదా వేస్తూ 2021 ఏడాది సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్య నిర్వహిస్తామని ఫెడరర్ తెలిపాడు. 2017, 2018, 2019లలో మూడుసార్లూ టీమ్ యూరోప్ జట్టే లేవర్ కప్‌లో విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ వాయిదా
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎందుకు: కోవిడ్-19 కారణంగా

వేలానికి లోకేశ్ రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్‌‌స, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్ 20న తెలిపాడు.
శ్రీలంకలో దక్షిణాఫ్రికా పర్యటన వాయిదా
శ్రీలంకలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం 2020 జూన్‌లో ఇరు దేశాల మధ్య మూడేసి వన్డేలు, టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ అదుపులోకి రాకపోగా... రోజురోజుకీ మహమ్మారి ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో సింహళ దేశంలో క్రికెట్ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్‌‌స, గ్లౌజులు, హెల్మెట్స్ వేలం
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎందుకు: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు

ఆన్‌లైన్‌లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), చెస్.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్గజ చెస్ క్రీడాకారులతో కూడిన ఆరు జట్ల మధ్య ఆన్‌లైన్‌లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. 2020, మే 5 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, రష్యా, యూరప్, చైనా, అమెరికా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు పాల్గొంటాయి. ర్యాపిడ్ ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ముందుగా డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ తర్వాత తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 10న సూపర్ ఫైనల్ జరుగుతుంది. ప్రతి జట్టులో నలుగురు ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఒక మహిళా క్రీడాకారిణికి స్థానం తప్పనిసరి. మొత్తం లక్షా 80 వేల డాలర్ల (రూ. కోటీ 38 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. చెస్ దిగ్గజాలు, ప్రపంచ మాజీ చాంపియన్స్ గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్, వ్లాదిమిర్ క్రామ్నిక్ తదితరులు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీలో భారత బృందానికి ఆనంద్ నాయకత్వం వహించనున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 2020, మే 5 నుంచి 10 వరకు నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్
ఎప్పుడు:ఏప్రిల్ 21
ఎవరు : అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), చెస్.కామ్
ఎక్కడ:ఆన్‌లైన్

కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కోపై వేటు
కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ ఫ్రాంచైజీ తరఫున కేవలం ఒక సీజన్‌కు మాత్రమే పనిచేసిన ఈల్కో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. 2019-20 ఐఎస్‌ఎల్ సీజన్‌లో ఈల్కో పర్యవేక్షణలోని కేరళ జట్టు 19 పాయింట్లతో ఏడో స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ‘కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సీతో హెడ్ కోచ్ ఈల్కో బంధం ముగిసింది. కోచ్‌గా అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. అతనికి భవిష్యత్‌లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని కేరళ బ్లాస్టర్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ఏప్రిల్ 22న ప్రకటించింది. నెదర్లాండ్‌‌సకు చెందిన 48 ఏళ్ల ఈల్కో ఐఎస్‌ఎల్‌లో కేరళ కన్నా ముందు నార్త్ ఈస్ట్ యునెటైడ్(2018-19)కు హెడ్ కోచ్‌గా వ్యవహరించి ఆ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కో స్కాటోరిపై వేటు
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు : కేరళ బ్లాస్టర్స్ జట్టు యాజమాన్యం

ఐ యామ్ బ్యాడ్మింటన్ అంబాసిడర్‌గా పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమం ‘ఐ యామ్ బ్యాడ్మింటన్’కు వరల్డ్ చాంపియన్, హైదరాబాద్ అమ్మాయి పీవీ సింధు అంబాసిడర్‌గా ఎంపికై ంది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ ఏప్రిల్ 22న ప్రకటించింది. నిజాయితీగా ఆడటం ద్వారా ఆట పట్ల తమకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఆటగాళ్లు వ్యక్తం చేసేందుకు ఈ ప్రచార కార్యక్రమం వేదికగా నిలువనుంది. ఈ ప్రచార కార్యక్రమానికి సింధుతో పాటు మిచెల్లీ లీ (కెనడా), జెంగ్ సీ వీయ్, హంగ్ యా కియాంగ్ (చైనా), జాక్ షెఫర్డ్ (ఇంగ్లండ్), వలెస్కా ఖోబ్‌లాచ్ (జర్మనీ), చాన్ హో యున్ (హాంకాంగ్), మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
వీరికన్నా ముందు బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్, బీడబ్ల్యూఎఫ్ పారాలింపిక్ అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్ రిచర్డ్ పెరోట్, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, విక్టర్ అక్సెల్‌సన్, హెండ్రా సతియావాన్, క్రిస్టినా పెడెర్సన్, చెన్ లాంగ్, మిసాకి మత్సుతోమో, అకయా తకహాషి 2016 నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమష్టి ప్రయత్నం ద్వారా బ్యాడ్మింటన్ క్రీడా లోకంలో అవగాహన పెంచడమే కాకుండా ఆట సమగ్రతను కాపాడటంలో ఆటగాళ్లను చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఐ యామ్ బ్యాడ్మింటన్‌కు అంబాసిడర్‌గా ఎంపిక
ఎప్పుడు:ఏప్రిల్ 22
ఎవరు : పీవీ సింధు
ఎందుకు: నిజాయితీగా ఆడటం ద్వారా ఆట పట్ల తమకు ఉన్న ప్రేమ, గౌరవాన్ని ఆటగాళ్లు వ్యక్తం చేసేందుకు

వార్తల్లో వ్యక్తులు
రోగులకు స్వీడన్ రాకుమారి సోఫియా సేవలు
Current Affairs
స్వీడన్ రాకుమారి సోఫియా ఏప్రిల్ 17 నుంచి ఆస్ప్రతిలో పనిచేయడం ప్రారంభించారు. డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు స్వీడన్ లోని సోఫియాహెమ్మెట్ యూనివర్సిటీ కాలేజీ వారానికి దాదాపు 80 మంది హెల్త్ కేర్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ కాలేజీకి సోఫియా గౌరవ చైర్ మెంబర్. మూడు రోజుల పాటు మెలకువలు నేర్చుకున్న రాకుమారి సోఫియా సేవలు అందించడం ప్రారంభించారు. మోడల్ రంగానికి చెందిన సోఫియా స్వీడన్ రాకుమారుడు కార్ల్ ఫిలిప్ ను పెళ్లాడడంతో రాజ కుటుంబంలోకి అడుగుపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రోగులకు స్వీడన్ రాకుమారి సేవలు
ఎప్పుడు:ఏప్రిల్ 17
ఎవరు : సోఫియా
ఎందుకు: డాక్టర్లపై ఒత్తిడి తగ్గించేందుకు

టామ్ అండ్ జెర్రీ దర్శకుడు జీన్ డీచ్ కన్నుమూత
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్ సీరియల్ టామ్ అండ్ జెర్రీ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జీన్ డీచ్ మరణించారు. 95 ఏళ్ల వయసున్న ఆయన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలోని తన అపార్టుమెంట్‌లో ఏప్రిల్ 16న హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు యూజీన్ మెరిల్ డీచ్. టామ్ అండ్ జెర్రీ 13 ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. పొపెయి అనే సీరయల్ సైతం రూపొందించారు.
జీన్ డీజ్ మొదట ఉత్తర అమెరికా వైమానిక దశంలో పనిచేశారు. అనంతరం పెలైట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో సైన్యం నుంచి బయటకు వచ్చారు. 1959లో ప్రేగ్‌కు చేరుకున్నారు. చిత్రకళలో గట్టి పట్టున్న ఆయన కార్టూన్లు గీయడంపై దృష్టి పెట్టారు. డీచ్ దర్శకత్వం వహించిన మన్రో అనే చిత్రం 1960లో బెస్టు యానిమేటెడ్ షార్టుఫిలింగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. జీన్ డీచ్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారంతా కార్టూనిస్టులే.
క్విక్ రివ్యూ:
ఏమిటి: టామ్ అండ్ జెర్రీ దర్శకుడు కన్నుమూత
ఎప్పుడు:ఏప్రిల్ 16
ఎవరు : జీన్ డీచ్(95)
ఎక్కడ:ప్రేగ్, చెక్ రిపబ్లిక్

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది.
బొప్పూడి కృష్ణమోహన్
1965, ఫిబ్రవరి 5న గుంటూరులో జన్మించిన కృష్ణమోహన్ 1988లో ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. గుంటూరు జిల్లా కోర్టులో కొద్ది నెలల పాటు ప్రాక్టీస్ చేశారు. 1994లో సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ అడ్వొకేట్లలో ఒకరిగా ఉన్నారు. 2019, జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు తొలి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఈయన.
కంచిరెడ్డి సురేష్‌రెడ్డి
అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో 1964, డిసెంబర్ 7న సురేష్‌రెడ్డి జన్మించారు. అనంతపురం ప్రభుత్వ కాలేజీలో బీఏ పూర్తి చేసిన ఆయన కర్ణాటకలోని గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1989 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది టి.బాల్‌రెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. క్రిమినల్ లాలో మంచి పట్టు సాధించారు. హైకోర్టులో ఉన్న అతి తక్కువ మంది ఉత్తమ క్రిమినల్ న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా మరణశిక్ష కేసులను వాదించడంలో దిట్ట. సివిల్, రాజ్యాంగపరమైన కేసులను కూడా వాదించారు.
కన్నెగంటి లలితకుమారి
లలిత కుమారి స్వగ్రామం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువు జములపాళెం. 1971, మే 5న జన్మించిన ఆమె పడాల రామిరెడ్డి లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, దేవదాయ శాఖ, టీటీడీ, వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెస్సైస్ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
ఎప్పుడు:ఏప్రిల్ 20
ఎవరు : బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి ఏప్రిల్ 20న సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు.
విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపి రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12 మంది ఉన్నారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకం అయితే ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి
ఎప్పుడు:ప్రిల్ 20
ఎవరు : సుప్రీంకోర్టు కొలీజియం

కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గందరగోళం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయిందన్న కథనాలతో ప్రపంచమే ఉలిక్కిపడింది. 36 ఏళ్ల వయసున్న కిమ్ గుండెకి జరిపిన శస్త్రచికిత్స ఆయన ప్రాణం మీదకి తెచ్చిందన్న అమెరికా మీడియాలో కథనాలు వస్తుంటే ఉత్తర కొరియా నోరు మెదపడం లేదు. కిమ్ ఆరోగ్యస్థితిపై అక్కడ మీడియా వార్తల్ని ప్రచురించలేదు. రోజువారీ వార్తల్ని కిమ్ సాధించిన విజయాలు, వివిధ రంగాలపై కిమ్ గతంలో వెల్లడించిన అభిప్రాయాల్ని మాత్రమే మీడియా ఇస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో, కాదో తనకు తెలీవని చెప్పారు. కిమ్ బాగానే ఉన్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 15న కిమ్ తన తాత ఇల్ సంగ్ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.

ఆసియాలో అపర కుబేరుడుగా ముకేశ్ అంబానీ
చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. ఫేస్‌బుక్, రిలయన్స్ జియో ఒప్పందంతో అంబానీ సంపద 4.69 బిలియన్ డాలర్లు పెరిగి 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఏప్రిల్ 23న తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యజమాని ముకేశ్ అంబానీ సంపద జాక్ మా కంటే సుమారు 4 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. జాక్ మా సంపద 46 బిలియన్ డాలర్లు. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ ఏప్రిల్ 22 నాటికి 1 బిలియన్ల డాలర్లను కోల్పోయింది.
మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.

Published on 5/9/2020 10:03:00 PM