‘సచివాలయ’ ఉద్యోగాలకు 22,73,793 దరఖాస్తులు

సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్ గామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు డిగ్రీ కనీస విద్యార్హతగా నిర్ణయించినా రికార్డు స్థాయిలో 22,73,793 దరఖాస్తులు అందాయి.
Education Newsఆగస్టు 11న అర్ధరాత్రి 11.59 గంటలకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. దరఖాస్తు ఫీజు చెల్లించిన వారు మాత్రమే రాత పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత ఉంటుంది. వాస్తవంగా ఆగస్టు 10వ తేదీ అర్ధరాత్రికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియాల్సి ఉండగా, రాష్ట్రంలో వరదలు ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడేవారి కోసమని ఆగస్టు 11 అర్ధరాత్రి వరకు గడువు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ సదుపాయం వల్ల ఆగస్టు 11వ తేదీన 58,350 మంది అదనంగా దరఖాస్తులు చేసుకున్నారు. కేటగిరీ- 1లో పేర్కొన్న నాలుగు రకాల ఉద్యోగాలకు కలిపి నిర్వహించే ఒకే రకమైన రాత పరీక్షకు అత్యధికంగా 12,88,888 దరఖాస్తులు అందాయి. ఈ కేటగిరీలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, గ్రామ, వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉద్యోగాలు ఉంటాయి. కేటగిరి-2 (ఏ)లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ ఉద్యోగాలకు 1,41,670 మంది, కేటగిరి- 2 (బీ)లో భర్తీ చేసే వీఆర్వో, సర్వే అసిస్టెంట్ ఉద్యోగాలకు 1,72,779 దరఖాస్తులు అందాయి. కేటగిరిలో-3లో మిగిలిన 11 రకాల ఉద్యోగాలకు మొత్తం 6,70,456 దరఖాస్తులు అందాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 2,13,751 దరఖాస్తులు అందాయి. విశాఖ, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి కూడా రెండేసి లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. విజయనగరం జిల్లా నుంచి అత్యల్పంగా దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రేతరులు రాత పరీక్షకు అనర్హులు :
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఎక్కడా స్థానికతకు అర్హతలేని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా.. రాతపరీక్ష రాయడానికి వీలు ఉండదని, వారికి హాల్‌టికెట్లు జారీ చేసే అవకాశం లేదని నియామకాల ప్రక్రియకు ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న వారిలో 6,397 మంది రాష్ట్రేతరులుగా పేర్కొంటూ దరఖాస్తులు సమర్పించారు. వీరిలో రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో చదివి, విభజన తర్వాత నిబంధనల మేరకు ఏపీ స్థానికతను అధికారికంగా పొందిన వారికి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

పరీక్ష నిర్వహణపై అధికారులు దృష్టి :
దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో అధికారులు ఇప్పుడు రాత పరీక్ష నిర్వహణపై దృష్టి పెట్టారు. 8 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ ఉద్యోగాలకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ)ల ఆధ్వర్యంలో రాతపరీక్షలు జరుగుతున్నప్పటికీ.. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతుందని అధికారులు చెప్పారు.

జిల్లా

దరాఖాస్తు చేసుకున్న వారు

ఫీజు కూడా చెల్లించిన వారు

శ్రీకాకుళం

1,41,872

1,36,717

విజయనగరం

1,19,470

1,15,195

విశాఖపట్నం

2,10,655

2,01,088

తూర్పు గోదావరి

2,13,751

2,05,282

పశ్చిమ గోదావరి

1,54,901

1,48,475

కృష్ణా

1,91,274

1,81,930

గుంటూరు

2,03,330

1,92,609

ప్రకాశం

1,59,433

1,51,582

నెల్లూరు

1,35,307

1,29,505

కర్నూలు

2,07,009

1,99,068

చిత్తూరు

1,87,894

1,79,099

వైఎస్సార్ కడప

1,57,011

1,50,074

అనంతపురం

1,81,000

1,74,082

రాష్ట్రేతరులు

6,397

4,903


అభ్యర్థులకు అనుకూలంగా...:
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో అర్హులైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న అన్ని పరీక్షలు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రాయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనేకమంది అభ్యర్ధులు తమ విద్యార్హతలకు తగ్గట్టుగా నాలుగైదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పరీక్షలన్నిటికీ హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అనుకూలంగా వేర్వేరు తేదీలను నిర్ణయిస్తోంది. అలాగే, ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు కూడా వీలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. వారికి వేర్వేరు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తే, మధ్యాహ్నం పరీక్షకు సకాలంలో చేరుకోడానికి అభ్యర్థులు అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యే అవకాశం ఉన్నందున అలాంటి వారు రెండు పరీక్షలను ఒకే కేంద్రంలో రాసేలా చర్యలు తీసుకుంటోంది.

త్వరలోనే పరీక్షల షెడ్యూలు:
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే విడతలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు నిరుద్యోగులు అనూహ్యంగా స్పందించారు. భారీగా దరఖాస్తులు రావడంతో పరీక్షల నిర్వహణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌‌సను నియమిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్, డెరైక్టర్ జె.విజయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు.

ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు :
అభ్యర్థులు అరగంటకు ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేదిలేదని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
Published on 8/12/2019 12:25:00 PM

సంబంధిత అంశాలు